Site icon NTV Telugu

Hyderabad: ఉరితాడైన అమ్మచీర.. ఊపిరాడక చిన్నారి మృతి

Kid

Kid

ఇంటి ముందు తల్లి చీరతో కట్టిన ఊయల ఆ చిన్నారికి ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారికి.. చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి అక్క‌డే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

లాలాపేట్‌కు చెందిన రాజేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నజ్యోతి కూలి ప‌నుల‌కు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (8) శనివారం ఇంటి ముందు తల్లి చీరను మెట్లకున్న పెద్దమేకుకు కట్టి ఊయల చేసి ఆడుకుంటుండగా ఆ చిన్నారి మెడకు చుట్టుకుపోయి గట్టిగా బిగిసుకుంది. చీరను తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఊపిరాడక ఎలీనా అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది.

త‌న అక్క మాట్లాడ‌డం లేద‌ని గ‌మ‌నించిన చెల్లెళ్లు స‌మీపంలోని బంధువుల‌కు చెప్పారు. దీంతో ఇరుగుపొరుగు వారు వ‌చ్చి చూడ‌గా ఎలీనా అప్పటికే ప్రాణాలు విడిచిందని స్థానికులు, బంధువులు తెలిపారు. ఆ సమయంలో తండ్రి ఊరెళ్లినట్లు తెలిపారు. తల్లి ఆలస్యంగా విషయాన్ని తెలుసుకుని బోరున విలపించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

Southwest Monsoon: కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Exit mobile version