NTV Telugu Site icon

GHMC: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ రికార్డ్‌. 3 నెలల్లో ఎన్ని కోట్లో తెలుసా?.

Ghmc

Ghmc

బల్దియా నయా చరిత్ర నెలకొల్పింది. ఆస్తి పన్ను వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలోనే ఏకంగా రూ.929 కోట్ల 22 లక్షలు రాబట్టింది. గత రెండేళ్లతో పోల్చితే తొలి 3 నెలల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రావటం ఇదే తొలిసారి. ఈ వసూళ్లు జూలై చివరికి రూ.1000 కోట్ల మార్కు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని మొత్తం 9 కోట్ల 8 లక్షల 3 వందల 41 అసెస్‌మెంట్ల నుంచి ఈ ట్యాక్స్‌ కలెక్ట్‌ చేశారు. ఈ నెల మొదటి 5 రోజుల్లోనే రూ.6 కోట్ల 13 లక్షలు వచ్చాయి.

మొదటి 4 నెలల్లో ఇంత ఆస్తి పన్ను పోగవటం గతంలో ఎప్పుడూ లేదు. 2020లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.682 కోట్లు, 2021లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.620 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.741 కోట్ల 35 లక్షలు వసూలయ్యాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అమలుచేసిన ఎర్లీ బర్డ్‌ (ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు) పథకం సూపర్‌ సక్సెస్‌ అయింది. ఏప్రిల్‌ 1న ప్రారంభమైన ఈ స్కీము 30వ తేదీతో ముగిసింది. పథకంలో భాగంగా ఆస్తి పన్నును అడ్వాన్స్‌గా చెల్లించినవారికి 5 శాతం రాయితీ ఇచ్చారు.

జూలై 1 తర్వాత పే చేయాలనుకుంటే అప్పటివరకు ఉన్న బకాయిపై నెలకు 2 శాతం వడ్డీ (పెనాల్టీ) కూడా పడుతుంది. అందుకే నగరవాసులు ప్రాపర్టీ ట్యాక్స్‌ని ముందే చెల్లించారు. మే నెలలో రూ.71 కోట్ల 45 లక్షలు రాగా జూన్‌లో 116 కోట్ల 42 లక్షలు వచ్చాయి. ఏప్రిల్‌ 30వ తేదీన ఎర్లీ బర్డ్‌ పథకం ముగుస్తుందనగా 28వ తేదీన ఒక్క రోజే రూ.50 కోట్లకు పైగా ఆస్తి పన్ను జమ కావటం విశేషం. జూలైలో జరిమానా పడుతుందనే ఉద్దేశంతో జూన్‌ 30వ తేదీన ఒక్క రోజే 43 కోట్ల 15 లక్షలు వసూలవటం గమనార్హం. ఆస్తుల యజమానులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో(జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో)నే పేమెంట్లు చేశారు.

సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవ కేంద్రాలతోపాటు బిల్‌ కలెక్టర్ల వద్ద కూడా చెల్లింపులు చేశారు. మొత్తం కలెక్షన్లలో శేరిలింగంపల్లి షేరే ఎక్కువ నమోదైంది. తర్వాతి స్థానాల్లో జూబిలీహిల్స్‌, ఖైరతాబాద్‌ నిలిచాయి. ఎక్కువ ఆస్తి పన్ను వసూలైదంటే భాగ్యనగరంలో వ్యాపార సంస్థలు, ప్రజలు కొవిడ్‌-19 ప్రభావం నుంచి కోలుకున్నట్లు భావించొచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. గతంలో బిల్‌ కలెక్టర్లు ప్రాపర్టీ ట్యాక్స్‌ కలెక్షన్‌ కోసం వెళితే నగరవాసులు తామింకా కరోనా ఎఫెక్ట్‌ నుంచి బయటపడలేదని, మరింత సమయం కావాలని కోరేవారు. కానీ ఈ ఏడాది అలాంటి రిక్వెస్టులేమీ రాకపోవటం శుభసూచకమని అన్నారు.

BJP: బాబు మోహన్‌కు బాలయ్య గట్టి పోటీ!