టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. ఆయన వయస్సు 56 సంవత్సరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ బాబు మృతి చెందారు.. దీంతో.. సూపర్ స్టార్ కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది.. అయితే, రమేష్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అభిమానులు తరలివస్తున్నారు.. ఈ నేపథ్యంలో అభిమానులకు ఘట్టమనేని ఫ్యామిలీ ఓ విజ్తప్తి చేసింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఘట్టమనేని కుటుంబం.. రమేష్‌బాబు మరణించారని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాం అంటూ.. ఆ ప్రకటనలో పేర్కొంది ఘట్టమనేని ఫ్యామిలీ.. కాగా, అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేష్‌బాబు. కృష్ణ, మహేష్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించిన ఆయన.. సుమారు 15 చిత్రాల్లో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్నారు.. అయితే, 2004 లో నిర్మాతగా మారారు. ‘అర్జున్’, ‘అతిథి’ సినిమాలు నిర్మించారు రమేష్‌బాబు.. ఇక, ఇవాళ రమేష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. మధ్యహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో రమేష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి..