తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆనాడు ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రామాలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మండువేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్‌లో తాగు, సాగునీటి కోసం అష్టకష్టాలు పడేవాళ్ళమని గుర్తు చేశారు. ఆనాడు కరెంట్ కావాలని తాను రైతులతో కలిసి ఉద్యమం చేస్తే.. కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి చూసి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన పలువురు బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే ఆయన పై విధంగా స్పందించారు. అలాగే.. ఈ సమావేశానికి హాజరైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ధనికుల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని.. అన్ని ప్రైవేట్‌పరం చేసి అంబానీ, అదానీలకు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎవరి మతం వారిదని, ఎవరి విశ్వాసం వాదని, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టదని వినోద్‌కుమార్ హితవు పలికారు.