సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత – చేవెళ్ల క్లోజ్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్ ను ఔషధ నగరం చేస్తానని మాయమాటలు చెప్పారని ఆయన ఆరోపించారు. ఈ అన్యాయాలపై 26న బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
అనంతరం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు- మన పోరు పేరుతో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ నెల 26న పరిగిలో భారీ బహిరంగ పెడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, మోసాలపై సమరశంఖం పూరిస్తామన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులను నిలిపేశారని, సోనియా గాంధీ తెలంగాణను సంపన్న రాష్ట్రం ఇస్తే.. ఈ రోజు అప్పులమయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని, రంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు.