తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీసీ సజ్జనార్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.. ఆర్టీసీని లాభాలా బాటలోకి తీసుకువచ్చారు. అయితే.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి జూన్ 1 వరకు తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అవస్థలు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సు్ల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఆర్టీసీ ప్రకటించిన విధంగానే.. విద్యార్థులను వారి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లాయి. మళ్లీ పరీక్ష ముగిసిన తర్వాత కూడా బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. అయితే నేడు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8.30 గంటల నుంచి విద్యార్థులను అనుమతించారు. ఈ సారి ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లోగా పరీక్షల ఫలితాలు ప్రకటిస్తారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో 2,861 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ విద్యార్థులతో కలిపి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా, పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు.