Devji : మావోయిస్టు ఉద్యమ పథం నుంచి న్యాయ విద్య వైపు అడుగులు వేస్తూ మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సరికొత్త రికార్డు సృష్టించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన, ఇటీవల విడుదలైన లాసెట్ (LAWCET) ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విప్లవ పంథాను వీడిన తర్వాత సమాజంలో మార్పు కోసం చదువును ఆయుధంగా మార్చుకున్న దేవ్‌జీ, గత నెల 12వ తేదీన కోరుట్లలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రాశారు. 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి లాసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడం విశేషం.
ఆయన న్యాయ విద్య (లా) అభ్యసించి, భవిష్యత్తులో లాయర్‌గా మారి సమాజంలోని పేదలు, నిరుపేదలకు ఉచితంగా న్యాయం చేయడమే తన జీవిత ధ్యేయమని ఈ సందర్భంగా దేవ్‌జీ ప్రకటించారు. ఒకప్పుడు అడవుల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన, ఇప్పుడు కోర్టుల ద్వారా చట్టబద్ధంగా పేద ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకోవడం పట్ల స్థానికులు, పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం చదువుకోవాలనే కసి ఉన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
