NTV Telugu Site icon

Harish Rao : కేంద్రంది ఎంతసేపు రైతులను ముంచే ఆలోచనే

Harish Rao

Harish Rao

కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన సరే వడ్లు కొంటామని ముందుకొచ్చిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి మంత్రి హరీష్ రావు పర్యటించారు. మండల కేంద్రాలైన రాయపోల్, తొగుటలో 3.5కోట్లతో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలతో మంత్రి ముచ్చటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినీలకు హైజీనిక్ కిట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అదేవిధంగా మిరుదొడ్డి మండలకేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు.

దుబ్బాక మండలం పోతరెడ్డిపేట లో 50 మంది ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. హబ్సీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఎంతసేపు రైతులను ముంచే ఆలోచనే చేస్తున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం నల్ల ధనం తెచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 16 లక్షలు వేస్తామని, నల్ల ధనం ఏమో గానీ రైతులపాలిట నల్ల చట్టాలను మాత్రం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో యాసంగి పండేదే బాయిల్డ్ రైస్ ఇది అందరికీ తెలిసిందే. మరీ బాయిల్డ్ రైస్ కొనమని చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. అంటే తెలంగాణలో పండని పంటను కొంటామని చెప్పడం బీజేపీది ఒక లంగ పంచాయితీ అన్నారు. బీజేపీ అంటేనే జూటే మాటలు చెప్పి మోసం చేయడం అన్నారు. వాళ్లు ఇప్పటి వరకు రైతులకు చేసిందేమీ లేదు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పుకునేందుకు 10 పనులు ఉన్నాయి. బిజెపి కి చెప్పుకోవడానికి ఒక్క పని సక్కగ లేదన్నారు.

కానీ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం పెంచిందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల రైతులకు వ్యవసాయ పనులకు అడ్డగోలు ఖర్చు పెరిగిందన్నారు. ఢిల్లీ వాళ్లు బాయిల కాడ విద్యుత్తు మోటార్లు పెడితే 25 వేల కోట్ల మూట ఇస్తామన్నా.. సీఎం కేసీఆర్ గొంతుల ప్రాణం ఉండగా మీటర్లు పెట్టమని తేల్చి చెప్పిండు అని గుర్తు చేశారు. అందుకే అందరం కలిసి బీజేపీ లాగులు పగుల గొడితే సాపైతారని ఎద్దేవా చేశారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ లో 20 డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఆపరేషన్ లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ మాత్రమే చేయించి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకొని డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. అనంతరం పట్టణంలోని ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు.