తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్ జిల్లా (100 శాతం) ప్రథమ స్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా (91.5 శాతం), తృతీయ స్థానంలో వరంగల్ జిల్లా (68.5 శాతం) నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో 57.7 శాతం మంది, మంచిర్యాల జిల్లాలో 43.9 శాతం మంది, పెద్దపల్లి జిల్లాలో 38.2 శాతం మంది, సంగారెడ్డి జిల్లాలో 34.7 శాతం మంది జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు.
