NTV Telugu Site icon

Kamareddy New Master Plan: కొత్త మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోకపోతే ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం

Kamareddy

Kamareddy

Kamareddy New Master Plan: కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకు నిరసనగా రైతులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. వీరితో పాటు వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌పై గత నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంట పొలాలను పారిశ్రామిక వాడలకు గుర్తించారనే మనస్తాపంతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తమ పొలాలను పరిశ్రమలకు కేటాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రాము ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు రాజీనామాలు సమర్పించారు.

Read also: Harish Rao: పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు.. వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసు

కొత్త మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సుమారు ఎనిమిది గ్రామాల రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ముట్టడికి రైతులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు.. కొత్త మాస్టర్ ప్లాన్ అంశాన్ని వెనక్కి తీసుకోకుంటే ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.