Fake Shopping Offers : పండుగల సీజన్, భారీ డిస్కౌంట్లు, క్లియరెన్స్ సేల్స్, ప్రత్యేక ఆన్‌లైన్ ఆఫర్ల పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్, ఈమెయిల్‌ల ద్వారా తక్కువ ధరలకు వస్తువులు అందిస్తున్నట్లు నమ్మించి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించింది.
ఉచ్చు బిగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, కస్టమర్ కేర్లు
సైబర్ నేరగాళ్లు అసలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను రూపొందించి, బ్రాండెడ్ వస్తువులపై 70 నుంచి 90 శాతం వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. “లిమిటెడ్ టైమ్ సేల్”, “స్టాక్ క్లియరెన్స్”, “ఈరోజే చివరి అవకాశం” వంటి సందేశాలతో వినియోగదారులను తొందరపెట్టి ముందస్తు చెల్లింపులు చేయిస్తున్నారు. అనంతరం వస్తువులు పంపకుండా ఫోన్ నంబర్లు, వెబ్‌సైట్లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా బాధితులను సంప్రదించి బ్యాంకు వివరాలు, ఓటీపీలు, యూపీఐ చెల్లింపులు తీసుకుని ఖాతాల్లోని నగదును కాజేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.
మోసాలను గుర్తించే విధానం , ముందస్తు జాగ్రత్తలు
నమ్మశక్యం కానంత తక్కువ ధరలు, కొత్తగా రూపొందించిన లేదా అనుమానాస్పద వెబ్‌సైట్లు, అధికారిక ప్లాట్‌ఫారమ్‌కు బయట చెల్లింపులు కోరడం, కస్టమర్ రివ్యూలు లేకపోవడం, “కొద్ది నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది” వంటి అత్యవసర సందేశాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అధికారిక, విశ్వసనీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే కొనుగోళ్లు చేయాలని, కొనుగోలు ముందు వెబ్‌సైట్ URLను తప్పనిసరిగా పరిశీలించాలని స్పష్టం చేసింది.
తెలియని వ్యక్తులు పంపిన షాపింగ్ లింకులపై క్లిక్ చేయవద్దని, విక్రేత రేటింగ్‌లు, కస్టమర్ సమీక్షలు, రిటర్న్ పాలసీని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని తెలిపింది. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా తెలియని యూపీఐ ఐడీలకు నేరుగా డబ్బులు పంపవద్దని, ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న సురక్షిత చెల్లింపు విధానాలనే ఉపయోగించాలని సూచించింది. “అసాధారణంగా తక్కువ ధర కనిపిస్తే అది ఆఫర్ కాకపోవచ్చు… సైబర్ ఉచ్చు కావొచ్చు” అంటూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి రక్షణకు ఉత్తమ మార్గమని అధికారులు పేర్కొన్నారు.

