Site icon NTV Telugu

ఇంటర్‌ ఫలితాలపై విశ్లేషణ చేయాలంటున్న నిపుణులు…

తెలంగాణలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా?

తెలంగాణలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్‌ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్‌ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు పరిశీలిస్తే… ఫెయిలైన విద్యార్థులు దారుణంగా విఫలమైతే… పాస్‌ అయిన విద్యార్థులు మంచి మార్కులతో పాస్‌ అయ్యారు. ఇంటర్‌నెట్‌ అందుబాటులో లేక, ఆన్‌లైన్‌ తరగతులు అందుకోలేక ఫెయిలైన విద్యార్థులు నష్టపోతే… ఆన్‌లైన్‌ క్లాసుల్ని చక్కగా అందిపుచ్చుకున్న విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారు. 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే… 2 లక్షల 24 వేల 12 మంది పాస్ అయ్యారు. 2 లక్షల 35 వేల 230 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 49 శాతం పాస్ అయితే… 51 శాతం ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిలో 51 శాతం మంది 75 శాతం కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. మరో 30 శాతం మంది 60 నుంచి 75 శాతం మధ్య మార్కులు తెచ్చుకున్నారు. అంటే పాసైన విద్యార్థుల్లో ఫస్ట్ క్లాస్‌ తెచ్చుకున్న వారు 80 శాతానికి పైగానే ఉన్నారు. పాసైన, ఫెయిలైన విద్యార్థుల అభ్యాసనంలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

విద్యార్థుల తప్పేమీ లేదని… డిజిటల్‌ టీచింగ్‌ ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఎవరికైతే ఆన్‌లైన్‌ క్లాస్‌లు అందాయో వాళ్లు మంచి మార్కులు తెచ్చుకోగలిగారని, అందని వాళ్లు ఒకటి రెండు ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేకపోయారని అంటున్నారు. ఎక్కువగా గ్రామీణ, పేద విద్యార్థులే నష్టపోయారని TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యార్థులకు బ్లెండెడ్ మోడ్‌లో విద్య అందించాలని, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోతే ఒక జనరేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.

ఇంటర్‌ ఫస్టియర్ ఫలితాలు విడుదల చేశాక తలెత్తిన వివాదం తర్వాతైనా ప్రభుత్వం మేల్కొని… విద్యార్థుల భవిష్యత్‌ కోసం చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెయిలైన వారిని పాస్‌ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని… జాగ్రత్త పడకపోతే సెకండియర్‌లోనూ అలాంటి ఫలితాలే చూడాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version