NTV Telugu Site icon

Munugode Bypoll: మునుగోడులో విజయం ఆ పార్టీదే.. తేల్చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌..

Munugode Bypoll

Munugode Bypoll

తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెంచిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 6వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియగా.. అప్పటికే క్యూలైన్లలో చేరినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.. పూర్తిస్థాయిలో పోలింగ్‌కు సంబంధించిన అధికార సమాచారం ఇంకా అందకపోయినా.. 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు అంచనా వేస్తున్నారు.. అయితే, పోలింగ్‌ ముగిసిన వెంటనే కొన్ని సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించారు.. అన్ని సర్వే ఫలితాల్లోనూ మునుగోడు గడ్డపై ఎగరబోయేది గులాబీ జెండేయని స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి నిరాశ తప్పదని తేల్చేశాయి సర్వేలు.. ఇక, అది మా సిట్టింగ్‌ స్థానం.. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్‌ పోరాటం చేసినా.. ఓట్లు రాబట్టలేకపోయింది ఆ పార్టీ.. ఇదే సమయంలో ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్‌ పార్టీ.. అన్ని వ్యూహాలతో తన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని విజయతీరాలను చేర్చిందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.

Read Also: Chandrababu and Lokesh: కుప్పం, మంగళగిరిలో అబ్బాకొడుకులు ఇద్దరూ ఓడిపోతారు..!

ఇక, ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తారని తేల్చేసింది.. అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 23 శాతం ఓట్లు వస్తాయని.. బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.. ఇక త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికార టీఆర్ఎస్‌కే పట్టం కట్టింది.. టీఆర్ఎస్‌కు ఏకంగా 47 శాతం ఓట్లు రానుండగా.. బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ కే పట్టం కట్టాయి.. అయితే, జనరల్‌ ఎలక్షన్స్‌కు ముందు వస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వ శక్తులు ఒడ్డాయి.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినా.. మళ్లీ గెలిచేది తానే అంటూ బీజేపీ నుంచి బరిలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డికి పెద్ద షాక్‌ తప్పదంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్.. బై ఎలక్షన్స్‌ వస్తే విజయం మాదేనని చెప్పుకునే బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నాయి.. మరి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. అసలైన ఫలితాల్లో రిపీట్‌ అవుతాయా? గెలిచేది టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థియేనా? అనేది తెలుసుకోవడానికి మాత్రం.. ఈ నెల 6వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.