Site icon NTV Telugu

కొడుకు, కోడలి నుంచి ప్రాణహాని.. పోలీసులకు మాజీమంత్రి ఫిర్యాదు..!

Satyanarayana Raju

Satyanarayana Raju

కొడుకు, కోడలి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు పోలీసులను ఆశ్రయించారు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం 4లో నివాసముంటున్నారు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు… ఆయన వయస్సు 75 ఏళ్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారాయన.. ఆయన భార్య జానకి గతేడాది మార్చిలో అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.. అయితే, కొడుకు కేవీఎస్ రాజు, కోడలు కంతేటి పార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు మాజీ మంత్రి…

కొడుకు రాజు, కోడలు పార్వతి.. భీమవరంలోనే ఉంటూ.. వ్యాపారం చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఆస్తిపాస్తుల విషయంలో సత్యనారాయణరాజుకు, కొడుకు రాజుకు మధ్య వివాదం నడుస్తోంది.. తనకున్న ఆస్తులను తన తదనంతరం కొడుకుకు ఇచ్చేలా వీలునామా కూడా రాసినట్టు చెబుతున్నారు.. కానీ, ఇప్పుడే ఆస్తులు తమకు కావాలంటూ కొడుకు, కోడలు బెదిరిస్తున్నారని.. ఇటీవల తన బెడ్రూమ్, అందులోని అల్మారా తాళాలు పగలగొట్టి ఆస్తులకు చెందిన పత్రాలను తస్కరించారని ఆరోపిస్తున్నారు సత్యతనారాయణ రాజు.. అంతేకాదు తాడేపల్లిగూడెంలో తన అత్తకు చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. తనకు కొడుకు కోడలి నుంచి ప్రాణహాని ఉందంటూ కంతేటి సత్యనారాయణరాజు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో కొడుకు రాజు, కోడలు పార్వతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version