Site icon NTV Telugu

మళ్లీ సొంత గూటికి కరీంనగర్ మాజీ మేయర్

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ మేరకు గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని రవీందర్‌ సింగ్‌కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read Also: గాంధీ ఆస్పత్రి మరో ఘనత.. దక్షిణాదిలోనే ఏకైక ఆస్పత్రి

కాగా ఇటీవల జరిగిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్‌కు రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీపై, మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూడా రవీందర్ సింగ్‌కు మద్దతు తెలిపింది. అయితే తాజాగా రవీందర్‌సింగ్ సీఎం కేసీఆర్‌ను కలవడంతో ఆయన త్వరలోనే మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

Exit mobile version