NTV Telugu Site icon

హుజూరాబాద్ బ‌రిలో పెద్దిరెడ్డి..? బీజేపీ ముఖ్య‌నేత‌ల‌తో మంత‌నాలు..!

Peddireddy

భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఈటెల రాజేంద‌ర్‌.. అన్ని రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి చివ‌ర‌కు ఢిల్లీ వెళ్లి మ‌రీ బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి త‌న అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్ప‌డం.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. మ‌ళ్లీ విమానంఎక్కి హ‌స్తిన‌కు వెళ్లి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం జ‌రిగిపోయాయి.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన త‌న నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్‌పై ఫోక‌స్ పెట్టిన ఆయ‌న‌.. త‌న వెంట‌న వ‌చ్చిన టీఆర్ఎస్ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను.. బీజేపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకుపోయే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, ఈట‌ల.. బీజేపీలోకి వ‌స్తార‌న్న ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి.. గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న వ్య‌క్తి బీజేపీ నేత పెద్దిరెడ్డి.. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే.. ఉప్పెన త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.. అయితే, బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తో బుజ్జ‌గింపుతో ఆయ‌న కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్టే క‌నిపించినా.. తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే మాత్రం అల‌క‌వీడిన‌ట్టు క‌నిపించ‌డంలేదు. అంతేకాదు.. కొత్త ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

హుజూరాబాద్‌లో ఓవైపు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఈట‌ల ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. ఆ ఉత్సాహంపై నీళ్లు జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు పెద్దిరెడ్డి.. బీజేపీలో ఈట‌ల కంటే సీనియ‌ర్ అయిన పెద్దిరెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో తానూ కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.. ఈట‌ల రాజేంద‌ర్.. క‌మ‌లం పార్టీలో చేరిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను క‌లిసిందిలేదు పెద్దిరెడ్డి.. ఇవాళ జ‌రిగిన బీజేపీ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలోనే ఆయ‌న క‌నిపించ‌లేదు.. త‌న‌కు అవ‌కాశం ఇస్తే హుజూరాబాద్ నుంచి పోటీచేస్తాన‌ని ఇప్ప‌టికే త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టిన పెద్దిరెడ్డి.. త‌న ముఖ్యఅనుచ‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. వాళ్ల‌తో మాట్లాడి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. మ‌రి.. ఈ ప‌రిణామాల‌పై పెద్దిరెడ్డి ఎప్పుడు నోరువిప్పుతారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.