Etela Rajender Fires On CM KCR: కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహారించారో, దానికి తానే సజీవ సాక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కుడి భుజం అని చెప్పి, ఆ తర్వాత పనికిమానిలోడు అంటూ తనని పంపించేశారని ఆయన మండిపడ్డారు. రోషమే తన ఆస్తి, ప్రజలే తన బలమని అన్నారు. రెండు లక్షల కోట్లు దళిత బందు ప్రకటన చేసినా.. కేసీఆర్ ముఖం చెల్లదని హుజూరాబాద్ ప్రజలు తీర్పునిచ్చారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ను క్షమాపణ చెప్తే, ఆయన స్థాయి తగ్గుతుందని తాను చెప్పానని.. కానీ చెంచా గాళ్లు, బ్రోకర్ గాళ్లు ఏం మాట్లాడారో మీకు తెలుసంటూ పేర్కొన్నారు.
దరణి వచ్చాక లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ మాయం చేశారని.. నిజానికి ఆ ధరణి ప్రజల కోసం కాదు, కేసీఆర్ కోసమేనని ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ భూములకు సంబంధించిన లావాదేవీల్ని ఇబ్బంది లేకుండా నిర్వహించడంలో.. ధరణి పోర్టల్ విఫలమైందని అన్నారు. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పుకునే తెలంగాణలో జీతాలేవీ? అని నిలదీశారు. ల్యాండ్‌పూలింగ్ పేరిట వేల ఎకరాల భూమిని అమ్ముకుని, జీతాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అన్ని పథకాల్లో ఇచ్చేది రూ. 24 వేల కోట్లు మాత్రమేనన్నారు. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లపైనే ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు రూ. 42 వేల కోట్లకు పైనే ఆదాయం వస్తోందని తెలిపారు. మద్యం తాగడం వల్ల ఏడు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
కేసీఆర్ ఫ్యూజు పీకాల్సింది ప్రజలేనని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని, ఆయన గద్దె దింపే సమయం ఆసన్నమైందని వెల్లడించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికి పోయార? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు.