తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని.. నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పానని తెలిపారు.
ఇక, ఎప్పుడూ నేను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనేనని.. ఎవరికి ఆపద వచ్చినా కో అంటే కో అనే బిడ్డను నేను అన్నారు ఈటల రాజేందర్.. రాజీనామా చేసిన తర్వాత నన్ను ఓడించడానికి ఎన్నివస్తున్నాయో చూడండి అని ప్రశ్నించిన ఈటల…. ఇంతకు ముందు పెన్షన్, రేషన్ కార్డు రావాలన్న సీఎం ఆఫీస్ కి పోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉప ఎన్నికల పుణ్యమా అని అన్ని ఇప్పుడు ఇస్తున్నారని తెలిపారు.. మరోవైపు.. అధికారాన్ని చేజిక్కించుకొని చెర బట్టిన వ్యక్తి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.