Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్

  • ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదం హైకోర్టుకు
  • నిందితుల అరెస్టుపై కీలక ఆదేశాలు
  • పోలీసుల తీరుపై ధర్మాసనం అసంతృప్తి
  • నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశం
Highcourt Telangana

Highcourt Telangana

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో చోటుచేసుకున్న పసుపు నీళ్ల వివాదంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయకుండా, కేవలం చట్టపరమైన నోటీసులు ఇచ్చి మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేస్తూ పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

రాజకీయ దుమారం రేపిన ‘పసుపు నీళ్ల’ ఘటన

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం తర్వాత ఈ వివాదానికి బీజం పడింది. కాంగ్రెస్ నిరసన ముగిసిన అనంతరం బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేతలు, స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో, బాధితులు రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం అత్యవసరంగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోలీసుల చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పుడు నిందితులను ఎలా అరెస్టు చేస్తారని ఘాటుగా ప్రశ్నించింది. ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని పక్కనపెట్టి తొందరపడి అరెస్టులకు వెళ్లడం సరికాదని మందలించింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని పోలీసులను హెచ్చరించిన ధర్మాసనం, నిందితులకు నోటీసులు అందజేసి చట్ట ప్రకారం విచారణ జరపాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.