Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్

  • ఎర్రవల్లి భూములపై 30 రోజుల్లో నివేదిక
  • కేసీఆర్ కుటుంబ భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు
  • ప్రభుత్వ భూముల వివరాలు తేల్చాలని ఆదేశం
  • ఆక్రమణలపై విచారణకు రేవంత్ ఆదేశాలు
Lands

Lands

తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించిన సీఎం, అక్కడి ప్రభుత్వ భూములను తేల్చేందుకు అధికారులకు 30 రోజుల గడువు విధించారు. నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులు , జిల్లా మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్ కుటుంబం వద్ద 700 ఎకరాలకు పైగా భూమి?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో వివాదాస్పదంగా ఉన్న భూమి దాదాపు 385 ఎకరాలు ఉందని, అసలు అక్కడ కేసీఆర్‌ ఆధీనంలో 700 ఎకరాలకు పైగా భూమి ఉందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎకరం భూమి కూడా లేదని, కానీ కేసీఆర్ కుటుంబం పేరుమీదే ఏకంగా 440 ఎకరాల భూమి ఎలా వచ్చిందని సీఎం ప్రశ్నించారు. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఎక్కడకు పోయింది? కేసీఆర్ పట్టా భూములు ఎంత? అనేది తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచుతామని స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూముల వివరాల వెల్లడి

సిద్దిపేట జిల్లా మార్కూక్‌ మండలంలో కేసీఆర్ , ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల వివరాలను సీఎం సభ దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం కేసీఆర్‌కు 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా 67 ఎకరాలు ఉందని తెలిపారు. కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరుపై మొత్తం 123 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో కేటీఆర్ ఫ్యామిలీకి 49 ఎకరాలు, ఆయన సతీమణి శైలిమ పేరు మీద 17 ఎకరాలు, కుమారుడు హిమాన్షు పేరు మీద 43 ఎకరాలు ఉన్నాయని వివరించారు. ఇక మాజీ మంత్రి హరీష్‌రావుకు 21 ఎకరాలు, ఆయన సతీమణి పేరిట 8.5 ఎకరాలు, సంతోష్‌ రావు కుటుంబానికి 79 ఎకరాలు (సంతోష్‌ పేరుపై 18.21 ఎకరాలు, ఆయన భార్యపై 7.2 ఎకరాలు) భూమి ఉందని సీఎం వెల్లడించారు.

భూముల బదిలీపై తీవ్ర ఆరోపణలు

సత్యం రామలింగరాజుకు చెందిన భూమి 2015లో కేటీఆర్ పేరుపైకి బదిలీ అయిందని, ఆ తర్వాత ఆయన భార్య శైలిమ పేరు మీదకు మారిందని సీఎం ఆరోపించారు. ఆపై 2021 జనవరిలో కేటీఆర్ అత్తగారి పేరు మీదకు సదరు భూమి బదిలీ అయిందని సభలో తెలిపారు. ఈ రకంగా జరిగిన భూ లావాదేవీలు , ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.