NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: కేంద్రం వాటిని కట్టొద్దని చెప్పి, నిధులు ఆపేసింది

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao On Nalgonda Development: రైతు కళ్ళాలు, రైతు వేదికలు కట్టొద్దని కేంద్రం చెప్తోందని.. రావాల్సిన నిధుల్ని సైతం ఆపేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 703 కోట్లు రావాల్సి ఉండగా.. రైతు కళ్లాల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేశామన్న కారణంతో ఆ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని, మిషన్ భగీరథ కోసం కూడా ఆ జిల్లాకు దాదాపు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల కారణంగా.. గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే.. కొంతమంది కావాలనే కిస్తీలకు డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆదేశమని, ఆయన ఆదేశాల మేరకు అన్ని రోడ్లు వేస్తామని దయాకర్ రావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలు, ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని అన్నారు. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయని.. నిజాయితీగా పని చేసిన సర్పంచులు, ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులను పొందుతున్నారని అన్నారు. అయితే.. కొంతమంది డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు.. కేంద్రం కూడా రాష్ట్రానికి రావలసిన డబ్బులను ఆపేసి, ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద మంచి పనులు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం.. ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్‌లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషమని తెలిపారు.