మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ లింగన్న గౌడ్‌ను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయంగా ట్రాక్టర్ పై తీసుకెళ్లి సర్పంచ్ లింగన్న గౌడ్ అంతక్రియలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.
పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగా మారాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా సాధ్యమైందని మంత్రి చెప్పారు. ఈ ప్రగతిని కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ లింగన్న గౌడ్ ను అభినందించి, తన సహకారం ఎల్లపుడూ ఉంటుందని మంత్రి వెన్నుతట్టారు.