Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: మోదీని గద్దె దింపడమే కేసీఆర్ లక్ష్యం

Errabelli On Modi

Errabelli On Modi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవ‌గాహ‌న లేకుండా, చ‌రిత్ర తెలియ‌కుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేద‌ని, అందువ‌ల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్‌ది కుటుంబ పాల‌న కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బ‌ద్ధంగా ప్రజ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారిని అవ‌మానించ‌డ‌మంటే.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవ‌హేళ‌న చేయ‌డ‌మేన‌ని ఎర్రబెల్లి చెప్పారు.

తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో కించపరిచిన మోదీ.. తెలంగాణ ప్రజ‌ల్ని నూక‌లు తిన‌మ‌ని అవ‌మాన పరిచారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వకుండా వివ‌క్ష చూపిస్తూనే ఉన్నారని.. ఇప్పుడు వ‌చ్చి తెలంగాణ‌పై క‌ప‌ట ప్రేమ చూపిస్తే ఎవ‌రూ న‌మ్మరని పేర్కొన్నారు. తెలంగాణ పై వివక్ష చూపడం, విషం చిమ్మడం, విద్వేషంతో మాట్లాడ‌ట‌మే మీ ప‌నా? అయితే మ‌తం లేక‌పోతే ప్రాంతాల పేరుతో ప్రజ‌ల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో మీరు గెలిస్తే.. తెలంగాణ అభివృద్ధి చేసి మళ్ళీ కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టనవి కూడా అమలు చేశామని చెప్పారు. వడ్లు కొనుగోలు ఆలస్యం కావడానికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు.

ఒక్క మెడికల్ కాలేజి తెలంగాణకి ఇచ్చారా? బ్యాంక్‌లను ముంచినోళ్ళని పట్టకువచ్చారా? అని నిలదీసిన ఎర్రబెల్లి.. దేవుని మీద గౌరవం ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీనే పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగిస్తోందని.. అంబానీ, అదానిల కోసమే ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. మోదీని గద్దె దింపడానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. మోదీని గద్దె దింపడమే ఆయన ఏకైక లక్ష్యమని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

Exit mobile version