Site icon NTV Telugu

Munugode bypoll: రేపే మునుగోడులో ప్రచారానికి తెర.. ఔటర్స్‌ ఖాళీ చేయాల్సిందే..

Munugode Bypoll

Munugode Bypoll

తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది.. ప్రధాని పార్టీలకు చెందిన నేతలే కాదు.. చిన్న పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో మునుగోడులో మొహరించారు.. అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితి.. చివరకు తాత్కాలిక గూడారాలు కూడా ఏర్పాటు చేసి తమ నేతలు, కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తున్నారు వివిధ పార్టీల నేతలు.. అయితే, ఇక మునుగోడు మొత్తం ఖాళీ కానుంది.. ఎందుకంటే.. రేపు మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది.. హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.. రేపు సాయంత్రం 6 గంటలకు మునుగోడులో ప్రచారం ముగుస్తుందని తెలిపారు.. ఇక, నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Read Also: Telangana Police : 13మంది తెలంగాణ పోలీసులకు స్పెషల్ ఆపరేషన్ మెడల్స్‌

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,41,000 ఓటర్లు ఉండగా.. ఉప ఎన్నికలో 298 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశాం.. అందులో అర్బన్‌ ప్రాంతంలో 35 పోలింగ్‌ స్టేషన్లు ఉంటే.. రూరల్‌లో 263 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని.. కొత్త ఓటర్ కార్డులు ఇచ్చాం.. అన్ని పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు వికాజ్‌ రాజ్‌.. 105 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని తెలిపారు. ఇక, నవంబర్‌ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడుతుందని.. ఆ తర్వాత మునుగోడులో ఓటు హక్కు లేనివాళ్లు మునుగోడులో ఉండకూడదని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇప్పటి వరకు మునుగోడులో 185 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.. రూ.6.80 కోట్ల క్యాష్ సీజ్‌ చేశాం.. 4,683 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నాం.. రాజకీయ పార్టీల నాయకుల నుంచి కూడా వచ్చిన ఫిర్యాదులు కలుపుకుంటే 479 ఫిర్యాదులు వచ్చాయన్నారు.. అంటే, రేపు సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి.. ప్రచార హోరు ఆగిపోయి ప్రలోభాలకు తెరలేసే అవకాశం ఉంది… మరోవైపు.. సోషల్ మీడియాలో కూడా రేపు సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు వికాస్‌ రాజ్..

ఇక, మునుగోడులో ప్రచారం ముగిసిన తర్వాత.. ప్రలోభాల పర్వం తెరలేసే అవకాశం ఉండడంతో.. ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే విచ్చలవిడిగా డబ్బులు పంచారని.. మద్యం ఏరులై పారుతుందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రచారం ముగిసిన తర్వాత ఇది మరింత ఊపందుకునే అవకాశం లేకపోలేదు.. ఒకరిని ఒకరు దూషించుకుంటున్నా.. చిన్న చితక పార్టీలు మినహాయిస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు జోరుగా డబ్బులు పంచుతున్నాయని.. మద్యం పంచుతున్నాయని.. ప్రచారంలో పాల్గొన్నవారికి ఓవైపు మద్యం.. మరోవైపు నాన్‌వెజ్‌తో భోజనాలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version