ప్రకృతి విపత్తుల వేళ దినసరి కూలీ సైతం దేశం కోసం ఆలోచిస్తాడని, అటువంటిది మన రైతులు కూడా పెద్ద మనసు చేసుకుని ఎల్ నినో ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న ఎల్ నినో పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. రాబోయే పది నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, రైతాంగాన్ని హెచ్చరించారు. డబ్బులిచ్చి ఎంత ఇష్టపడినా నీటిని కొనుగోలు చేయలేమని, ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని హితవు పలికారు. ఎవరో చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని, దేశ ప్రజల ఆకలి తీర్చే అన్నదాతలు ఈ ఒక్క సీజన్ వరి సాగుకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీతో పేదల సంరక్షణ.. చెరువుల పునరుద్ధరణ
ఎల్ నినో ప్రమాదం నుంచి పేదలను, కూలీలను కాపాడుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉపాధి హామీ పనులు చేస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో వర్షాలు కురిసినప్పుడు నీరు సమృద్ధిగా నిల్వ ఉండేలా చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత , ఇతర పనులను కూలీలతో పెద్ద ఎత్తున చేయిస్తామని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం పొందాలనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని, త్వరలోనే అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన అదనపు విద్యుత్ను సబ్సిడీ ధరకు కేటాయించాలని కోరారు.
రాజకీయ విమర్శలపై సీరియస్.. కోవిడ్ నాటి సంయమనం అవసరం
రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో రాజకీయాలు చేయడం తగదన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అందరం కలిసికట్టుగా ఎలా స్పందించామో గుర్తుచేసారు. కోవిడ్ సమయంలో దీపాలు పెట్టమంటే పెట్టామని, ప్లేట్లు కొట్టమంటే కొట్టామని, సరిగ్గా అదే విధంగా ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనే విషయంలోనూ అన్ని రాజకీయ పార్టీలు అదే స్థాయి సంయమనాన్ని, బాధ్యతను ప్రదర్శించాలని సీఎం పిలుపునిచ్చారు.

