NTV Telugu Site icon

Eatala-Komatireddy: ఈటల, కోమటిరెడ్డిలకు నిజంగా అంతుందా?. కేసీఆర్‌ పైన ఎందుకీ ఛాలెంజ్‌లు?

Eatala Komatireddy

Eatala Komatireddy

Eatala-Komatireddy: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల వరుసగా ఇస్తున్న స్టేట్మెంట్లను చూస్తుంటే నిజంగా వాళ్లకు అంతుందా అనిపిస్తోంది. వాళ్లు ఏమంటున్నారంటే.. సీఎం కేసీఆర్‌ తన మీద పోటీ చేసి గెలవాలని ఈటల ఛాలెంజ్‌ చేస్తున్నాడు. ఎక్కడ బరిలోకి దిగాలి అనే ఆప్షన్‌ని ఆయనకే వదిలేస్తున్నానని అన్నాడు. గజ్వేల్‌లోనా, హుజూరాబాద్‌లోనా అనేది కేసీఆరే తేల్చుకోవాలని సూచించాడు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘మునుగోడు ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌ పతనమే’ అని పెద్ద మాట మాట్లాడాడు.

ముందు ఈటల విషయానికొద్దాం. ఈటలను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బయటికి పంపించేసిన విధానం కరెక్ట్‌గా లేదనేది అందరూ ఒప్పుకునేదే. అందుకే కారు పార్టీ హుజారాబాద్‌ బైఎలక్షన్‌లో గెలవలేకపోయింది. అంతమాత్రానికే ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ పైన పగబట్టి తన స్థాయిని మించి, తన స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేయటం సరిగా లేదని జనం అనుకుంటున్నారు. నిజానికి ఈటలది కేసీఆర్‌ లెవల్‌ కాదు. ఎందుకంటే ఈటల ఎమ్మెల్యే మాత్రమే. కానీ కేసీఆర్‌ ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతకుమించి తెలంగాణ సెంటిమెంట్‌కి ఛాంపియన్‌.

Rare Love Marriage: అరుదైన ప్రేమ పెళ్లి. ఆన్ లైన్ వివాహానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

ఇవేవీ ఈటలకు లేవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ రేప్పొద్దున ఈటల కేసీఆర్‌ పైన గెలిచాడనే అనుకుందాం. అయితే ఏమవుతుంది? ఈటల తెలంగాణకు సీఎం కాలేడు కదా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే స్పష్టంగా కనిపించట్లేదు. కాబట్టి ఈటల ముఖ్యమంత్రి అవటం కల్ల. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మాదిరిగా సీఎం హోదాలో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఓడిపోయాడనే అనుకుందాం. అయినా ఆయన మూడోసారి సీఎం కావటానికి సెంట్‌పర్సెంట్‌ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈటల కేసీఆర్‌పైన గెలిచినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. విమర్శించటానికి తప్ప అది దేనికీ పనికిరాదు.

మమతా బెనర్జీ మీద నెగ్గిన సువేందు అధికారి ఇవాళ అడ్రస్‌ లేడు. కానీ మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్‌ని ఓడించకపోతే తన జీవితానికే సార్థకతే లేదనేంత వ్యక్తిగత, ఫ్రస్టేషన్‌ స్థాయికి ఈటల వెళ్లకపోవటమే బెటర్‌. ఈటల పైన ప్రజలకు ఇప్పటికీ కొద్దోగొప్పో అభిమానం ఉంది. వాస్తవ దూరమైన ప్రకటనలు చేయటం ద్వారా ఆ అభిమానాన్ని పోగొట్టుకొని చులకన కావొద్దని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. దీనికన్నా తన అనుభవంతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తే రేపో మాపో కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందని పేర్కొంటున్నారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంగతి చూద్దాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి ఇంకో 15-20 రోజులు ఆగుతాడంట. ఈలోపు సర్వే చేయిస్తాడంట. అంటే.. రాజీనామా చేస్తే ఉపఎన్నికలో మళ్లీ గెలుస్తానో లేదో అనే అనుమానం కలిగిందా? అని అనలిస్టులు భావిస్తున్నారు. రిజైన్‌ చేయాలనుకున్నప్పుడు చేసేయటమే. వెనకా ముందు ఆలోచించటం దేనికి? అసలు ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయమని ఎవరడిగారు?. వెళితే బీజేపీలోకి వెళ్లమనండి. వెళ్లాక రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీవాళ్లు అడుగుతారు. ఎందుకంటే ఆయన ఆ పార్టీ సభ్యుడు కాబట్టి.

ఉపఎన్నిక రావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నాడని కోమటిరెడ్డి అంటున్నాడు. బైఎలక్షన్‌ రావాలని కేసీఆర్‌ ఎందుకు అనుకుంటాడు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే పెరుగుతాడు. అంతకుమించి అధికార పార్టీకి లాభమేదీ ఉండదు. ఒక ఎమ్మెల్యే పెరగకపోయినా టీఆర్‌ఎస్‌కి నష్టం కూడా ఉండదు. ఇంకో విషయం. హుజూరాబాద్‌లో ఈటల గెలిచాడంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. కానీ మునుగోడులో కోమటిరెడ్డికి అలాంటి పాయింట్‌ ఏదీ లేదు. కాబట్టి బైఎలక్షన్‌ జరిగితే ఆయన ఓడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అందుకే రాజీనామాకు వెనకడుగు వేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది.

తాను సీఎల్పీ పదవిని ఆశిస్తే దాన్ని భట్టి విక్రమార్కకు ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి మొన్నే అన్నాడు. అంతకుముందు పీసీసీ చీఫ్‌ పోస్టును రేవంత్‌రెడ్డికి ఇవ్వటం సైతం కరెక్ట్‌ కాదని చెప్పాడు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు సరైన గుర్తింపు లేకనే మీడియాలో ఈ హడావుడి చేస్తున్నాడు తప్ప అసలు ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన అవసరమే ఇప్పుడు లేదని జనం అనుకుంటున్నారు. బైలెక్షన్లలో గెలిచిన రఘునందన్‌రావు, ఈటల రాజేందరే బీజేపీలో కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నారు. తమకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదనే అసంతృప్తి వాళ్ల మొహాల్లో కనిపిస్తోంది.

ఇక్కడ బండి సంజయ్‌ని ఏమీ అనలేక హైకమాండ్‌ వద్ద తమ బాధను వెళ్లబోసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచినా ఆ తర్వాత కమలంలో పార్టీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్‌ ఇస్తారా అనేది డౌటే. ఇగో ఫీలింగ్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డితోనే కలిసి పనిచేయలేకపోయిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో బండి సంజయ్‌తో మాత్రం ఎలా కలిసి ముందుకు సాగగలడనే ప్రశ్న తలెత్తుతోంది. అందువల్ల ఆయన ఇంకా ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం మంచిదని పలువురు సూచిస్తున్నారు.