ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!

  • పటియాలా, పుణె, చండీగఢ్‌లో ఏకకాలంలో ఈడీ సోదాలు
  • మూడు లైవ్ కాల్ సెంటర్లలో 220 మంది సిబ్బంది
  • డాలర్ల మోసపు డబ్బును రూపాయిల్లోకి మార్చిన ముఠా
  • 66 ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు సహా భారీగా డిజిటల్ ఆధారాలు
Ed Raids

Ed Raids

ED Raids : అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్‌ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA)-2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయ అధికారులు సెప్టెంబర్‌ 15న పటియాలా, పుణె, చండీగఢ్‌లలోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల ముఠా గుట్టు రట్టయింది.

మూడు లైవ్ కాల్‌ సెంటర్లు గుర్తింపు.. 220 మంది సిబ్బంది పరిశీలన

సోదాల సమయంలో ఈడీ అధికారులు పటియాలాలో రెండు, పుణెలో ఒకటి చొప్పున మొత్తం మూడు ప్రత్యక్ష (లైవ్) కాల్‌ సెంటర్లను గుర్తించారు. అధికారులు సోదాలు జరుపుతున్న సమయంలో ఈ సెంటర్లలో సుమారు 220 మంది ఉద్యోగులు విధుల్లో ఉండటం గమనార్హం. వర్క్‌స్టేషన్లు, క్యూబికల్స్, కంప్యూటర్లు, హెడ్‌సెట్లు , వీఓఐపీ (VoIP) ఆధారిత సిస్టమ్‌లతో ఇవి నడుస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తింపు, వారికి అప్పగించిన బాధ్యతలు, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాన సూత్రధారుల వివరాలను అధికారులు నమోదు చేసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.

మోసం ఇలా.. అమెరికన్ డాలర్ల నుండి భారతీయ రూపాయిల్లోకి మళ్లింపు

పటియాలా, పుణె కేంద్రాలుగా సాగుతున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ప్రతినిధులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వివిధ తప్పుడు కారణాలు చెబుతూ భయభ్రాంతులకు గురిచేసేవారు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను చెల్లించేలా ప్రేరేపించి మోసాలకు పాల్పడేవారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇలా అమెరికన్ డాలర్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన నిధులను భారతీయ కరెన్సీగా మార్చే ప్రక్రియను ఒక ముఠా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

చండీగఢ్‌ కేంద్రంగా హవాలా, నియంత్రణ సేవలు

చండీగఢ్‌లోని ఒక నివాస ప్రాంగణంలో జరిగిన సోదాల్లో ఈ మొత్తం దందాకు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థ బయటపడింది. పటియాలాలోని కాల్ సెంటర్ల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, అమెరికా నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చే ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రధాన సూత్రధారి ఈ చండీగఢ్ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ నిధుల పంపిణీకి సంబంధించిన అనేక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి.

భారీగా డిజిటల్ పరికరాలు, కాలింగ్ స్క్రిప్టులు స్వాధీనం

ఈ దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు 66 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, నెట్‌వర్కింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, నగదు , పలు ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల డేటా, ఉపయోగించిన కాలింగ్ స్క్రిప్టులు, డయలర్లు, చెల్లింపు మార్గాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేరం ద్వారా వచ్చిన నిధుల ప్రవాహాన్ని (Proceeds of Crime) పూర్తిగా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కేసులో తదుపరి దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.