Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్‌ గుట్టురట్టు..

Fake Call Centre

Fake Call Centre

Fake Call Centre Scam: హైదరాబాద్: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని వందల కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడుతున్న భారీ నకిలీ కాల్ సెంటర్ ముఠా నెట్‌వర్క్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఛేదించింది. నకిలీ కాల్ సెంటర్ల ద్వారా సాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా హర్షిల్ నయన్ భాయ్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పిఠాదియా అనే నలుగురు నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 కింద నవంబర్ 3న ఈడీ అరెస్ట్ చేసింది. నాంపల్లిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో వీరిని హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

గతంలో ఇదే కేసులో వికాస్ నిమర్, తారాచంద్ నిమర్, మహ్మద్ ఇర్ఫాన్ అన్సారీలను అరెస్ట్ చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజా అరెస్టులతో ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన వారి సంఖ్య మొత్తం ఏడుకు చేరింది. సుమారు రూ. 261 కోట్ల దోపిడీ: భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318, 336, 340, 61ల కింద నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. భారత్ కేంద్రంగా నడుస్తున్న ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా జులై 2025 నుండి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలోనే దాదాపు 27.39 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 261 కోట్లు) దోచుకున్నట్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆధారాలు లభ్యమయ్యాయి. 1940ల కాలంలో జన్మించిన అమెరికా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా పెద్దఎత్తున మోసాలకు పాల్పడింది.

మోసాల నెట్‌వర్క్ తీరు: ఈ ముఠాకు చెందిన వ్యక్తులు అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, వారి ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని భయపెట్టేవారు. యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), యూఎస్ ట్రెజరీ వంటి కీలక సంస్థల అధికారుల పేర్లతో నకిలీ ఐడీ కార్డులు, బ్యాడ్జీలు, నకిలీ కోర్టు పత్రాలు చూపి బెదిరింపులకు దిగేవారు. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవాలంటే నగదు, బంగారం, కొరియర్ ద్వారా క్యాష్ పార్శిళ్లు పంపాలని లేదా క్రిప్టోకరెన్సీ రూపంలో బదిలీ చేయాలని బలవంతం చేసేవారు. అమెరికాలో సేకరించిన ఈ సొమ్మును హాంకాంగ్, దుబాయ్ కంపెనీల ఖాతాలకు మళ్లించి, క్రిప్టోకరెన్సీ (USDT, Bitcoin) మరియు హవాలా, అంగడియా మార్గాల ద్వారా భారత కరెన్సీలోకి మార్చేవారు.

సోదాల్లో కీలక ఆధారాలు స్వాధీనం: గతంలో పటియాలా, పూణే, చండీగఢ్‌లలో నిర్వహించిన సోదాల్లో మూడు లైవ్ కాల్ సెంటర్లలో 220 మంది పనిచేస్తుండగా గుర్తించారు. 65 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు, భారీగా డేటా ఉన్న డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. బాధితులను బెదిరించేందుకు జర్మనీ, ఫిన్లాండ్ దేశాల్లోని సర్వర్లను, ఆటో-డయలర్లను వాడినట్లు గుర్తించారు. 397 యూఎస్ బ్యాంక్ ఖాతాలు, 140 మంది అమెరికన్ల సోషల్ సెక్యూరిటీ నంబర్లు (SSN), డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను ఈ ముఠా దుర్వినియోగం చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.