DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!

  • 15 చోట్ల ఏసీబీ ఏకకాల సోదాలు
  • విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల గుర్తింపు
  • 2 కిలోల బంగారం, రూ.43.6 లక్షల నగదు స్వాధీనం
  • అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం
Bheemreddy

Bheemreddy

DSP Bheem Reddy : తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న శ్రీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ఆయన తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అవినీతి నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించి విస్తుపోయేలా భారీగా స్థిరాస్తులు వెలుగుచూశాయి. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో ఒక అంతస్తుల నివాస భవనంతో పాటు పెంట్ హౌస్, సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్‌ను అధికారులు కనుగొన్నారు. వీటితో పాటు గచ్చిబౌలి క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్, తెల్లాపూర్ అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాణిజ్య, వినోద రంగాల్లో చూస్తే మణికొండ లాంకోహిల్స్ రోడ్డులోని వాణిజ్య సముదాయంలో వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో వాణిజ్య స్థలం, ప్రగతి రిసార్ట్స్ వద్ద ఓపెన్ ప్లాట్ గుర్తించారు. అంతేకాకుండా నాగోల్, పటాన్‌చెరు, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్ ప్రాంతంలో పలు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొమిన్‌పేట్, సీసీ కుంట మండలం ముచింతల గ్రామాలతో పాటు కర్ణాటక, బెంగళూరు పరిసరాల్లో భారీగా వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార పెట్టుబడిగా శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ. 75 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పత్రాల ద్వారా స్పష్టమైంది.

స్థిరాస్తులతో పాటు సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, ఇతర విలువైన వస్తువులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. భీమ్ రెడ్డి స్వగృహంలో రూ. 3.60 లక్షల నగదు దొరకగా, ఆయన బినామీ ఇంట్లో ఏకంగా రూ. 40 లక్షల నగదు లభ్యమైంది. వీటితో పాటు సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు , వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 19.91 లక్షల నిల్వలను సీజ్ చేశారు. ఈ ఆస్తుల యొక్క అసలు మార్కెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే, సోదాల సమయంలో సదరు అధికారి నివాసంలో 23 విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు గుర్తించి, ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించారు. భీమ్ రెడ్డికి సంబంధించి ఇంకా అదనంగా ఉన్న ఆస్తులపై ప్రస్తుతం ధృవీకరణ ప్రక్రియ , కేసు విచారణ కొనసాగుతోంది.