వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్టంలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్షాలకు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వరిధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో పలు చోట్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు మాత్రం వరి పంటనే కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ రణరంగా మార్చుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోలు గురించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రెండు తోడు దొంగలని విమర్శించారు.
చివరి గింజ వరకు కొంటామని, కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కేంద్రం ముందు మెడలు వంచుకున్నారా..? అంటూ ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్ల చెప్పు చేతుల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రాష్ర్టంలో ఓ వైపు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కేసీఆర్ మాత్రం పర్యటనలు అంటూ ఢిల్లీ వెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతులపై రాజకీయాలు మాని వెంటనే ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని కొనాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
