Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు

  • స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
  • దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై కీలక తీర్పు
  • కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లపై విచారణ
  • దానం ఎమ్మెల్యే సభ్యత్వంపై ఆసక్తికర పరిణామం
Danam

Danam

Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన అంశంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్.. దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించే తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల ప్రధాన వాదన ప్రకారం.. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరడంతో పాటు అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయన స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నట్లుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు మాత్రం కాంగ్రెస్ నేతలను కలవడం, కాంగ్రెస్ కండువా ధరించడం వంటి వార్తా కథనాలు, ఫొటోల ఆధారంగా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించలేమని వాదించారు. ఆయన పేరు అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారం తొలుత సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దానం నాగేందర్ సహా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని 2025 జూలై 31న సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. అనంతరం స్పీకర్ విచారణ చేపట్టి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 21న ఇరువైపులా వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు వెలువరించాల్సి ఉండగా.. అనంతరం సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.

తాజాగా హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టడంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల అంశంలో ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా ఈ తీర్పు ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.