బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , టీపీసీసీ రేవంత్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. నోరు భద్రంగా పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి సమన్వయం కోల్పోయి మాట్లాడాడని మండిపడ్డారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాడా? అదే పార్టీకి సేవ చేసి టీపీసీసీ అయ్యాడా? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారే కదా టీపీసీసీ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై, సోనియా, రాహుల్, వైఎస్సార్ పై మాట్లాడిన భాషను రేవంత్ గుర్తు చేసుకోవాలని డీకే అరుణ తెలిపారు. సోనియా దేవత కాదు.. వేలమందిని బలి తీసుకున్న బలి దేవత అన్నాడు. అది మరిచిపోయాడా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సోనియాను గతంలో తెలంగాణ తల్లి కాదు అన్నాడు.. ఇప్పుడు భక్తుడిగా చెప్పుకుంటున్నాడని ఎద్దేవ చేసారు.
కాంగ్రెస్ ప్రజల విశ్వాసం, అధికారాన్ని కోల్పోయిందని అన్నారు. ఈడీ అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ అని కామెంట్స్ చేస్తున్నాడని, కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐతో కేసులు వేయించిన విషయం మరిచిపోయావా? అంటూ గుర్తు చేసారు. రేవంత్ రెడ్డి.. తెలంగాణ చంద్రబాబు ఇద్దరు ఒక్కటే అని డీకే అరుణ అన్నారు. ఆయన్ను పీసీసీ చేసింది చంద్రబాబు, కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్న కొందరు.. టీఆరెస్ నేతలతో ములాఖత్ అవుతున్నారు. ఇంకొందరు ఎన్నికల సమయం వరకు వేచి చూద్దాం అని మంతనాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
read also: Lucky Lakshman: సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్
గిరిజన, ఆదివాసీ మహిళకి రాష్ట్రపతిగా అవకాశం ఇస్తే కాంగ్రెస్, టీఆరెస్ జీర్ణించుకోలేక కలిసి ఓడించాలని చూశారని గుర్తుకు చేసారు. రేవంత్ రెడ్డి నువ్వు ఇవ్వాళ ఒక పీసీసీగా ఉన్నావు.. హుందాతనంతో మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అసహనంతో మాట్లాడుతున్నాడు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలని విమర్శించారు. బీజేపీని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నా కాపాడుకోలేని మీరు ప్రజలను ఏం కాపాడుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తప్పులు చేసి మిస్టర్ క్లీన్ లాగా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని, మునుగోడులో కూడా డిపాజిట్ దక్కదనే అసహనంతోనే రేవంత్ ఇలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని డీకే అరుణ అన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేదు, పథకాల అమలు, ప్రాజెక్టులు లేవు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధి జరగాలని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందే టీఆరెస్ వెళ్లి ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసుకుంటోంది.
ఇన్ని రోజులు ఎందుకు వెళ్లి అభివృద్ధి చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భావనతో పబ్లిక్ లో సింపతి కోసమే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం డ్రామా అంటూ విమర్శించారు. గతంలో శ్రీనివాస్ గౌడ్ కూడా అదే సీన్ చేశారని గుర్తు చేసారు. ఇదంతా కట్టు కథ.. సినిమాలో కూడా అలా డ్రామా చేసి ఉండరని మండిపడ్డారు. పీకే రిపోర్టులో ఓడిపోతారని ఉండటంతో ఈ డ్రామా. సలహాలు కూడా ఆయనే ఇస్తున్నాడో? మరెవరైనా ఇస్తున్నారో? అంటూ డీకే అరుణ విమర్శించారు.
Etela Rajender: రాజగోపాల్ రెడ్డి నాకు మంచి మిత్రుడు