Commercial Cylinders: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈనెల 8 నుంచే ఇది అమల్లోకి వచ్చింని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో.. 45 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయని.. మొత్తం 738 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని వివరించారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,949.50 ఉన్నదని, దీనిపై రూ.100 నుంచి రూ.200 వరకు రాయి తీ ఇచ్చే వారని చెప్పారు. అయితే పూర్తిగా తొలగించామని తెలిపారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు, కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య సిలిండర్లపై రాయితీని ఉపసంహరించారని తెలిపారు. ఇక, ఎల్‌పిజి ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు పాటించాలని పంపిణీదారులు కోరారు. అయితే.. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే వినియోగదారులు హెచ్‌పీ, బీపీసీ, ఐవోసీఎల్ సంస్థల్లో రిజిస్టర్ అయి ఉండాలని తెలిపారు..ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి శ్రీచరణ్, సభ్యులు అశోక్, వెంకట్‌రావు పాల్గొన్నారు.