ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇక, బందోబస్తు ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు సీఎస్ సోమేష్ కుమార్.. సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.. గోల్కొండ కోటలో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, మాస్క్ లు, శానిటైజర్ లను సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వసంపదను ప్రతిభింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కళాబృందాలను సమీకరించాలని కోరారు సీఎస్ సోమేష్ కుమార్. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంద్రాగట్టు వేడులకను ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.