ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు బలవర్మణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని నారంరెడ్డి కాలనీకి చెందిన త్రినాథ్‌రెడ్డి(35), ఆయన భార్య మల్లిక (33) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్రినాథ్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. మల్లిక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వారికి 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. పెళ్లి అయిన కొన్ని ఏళ్ల వరకు సాఫీగా సాగిన వారి ప్రయాణంలో గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరూ గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతసేపైనా గది నుంచి దంపతులు బయటకు రాకపోవడంతో త్రినాథ్‌రెడ్డి తల్లి అమరావతి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి త్రినాథ్‌రెడ్డి, మల్లికను ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. త్రినాథ్‌రెడ్డి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.