NTV Telugu Site icon

అప్పుడే పాఠశాలల్లో కరోనా కలకలం.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన..!

కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు ఆ స్కూలుకు సెలవులు ప్రకటించారు. పిల్లలను స్కూలుకు పంపాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా కలకలం రేపడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

అయితే పాఠశాల స్టాఫ్‌కు టీకాలు వేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నామని చెబుతున్నమని చెబుతున్నా.. టీచర్‌కు కరోనా పాజిటీవ్ రావడం ఆందోళన కల్గిస్తున్న అంశం.. ఇక టీకాలు తీసుకోని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్‌లో ఉన్నారు తల్లిదండ్రులు. ఒక్కో తరగతి తరగతి గదిలో 15మంది కంటే ఎక్కువ విద్యార్థులను కూర్చొబెట్టొద్దని చెప్పింది ప్రభుత్వం. అయితే, అది ఎక్కడా అమలు జరిగినట్లు కనిపించడం లేదు. అటు ట్రాన్స్‌పోర్ట్‌ అతి పెద్ద సమస్యగా మారింది. ఫిట్‌నెస్‌ పొందిన స్కూలు బస్సులు రాష్ట్రంలో వెయ్యి మాత్రమే ఉన్నాయి. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే బస్సులను సీజ్‌ చేస్తామని హెచ్చరించడంతో చాలవరకు యాజమాన్యాలు బస్సులు తిప్పడం మానేశాయి. మరోవైపు ఆటోలో పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. ఎక్కువ శాతం వాళ్లే స్కూళ్ల వద్ద పిల్లల్ని దింపి వెళ్తున్నారు. మరోవైపు భవిష్యత్‌ బెంగతో పిల్లల్ని స్కూళ్లకు పంపుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయం మాత్రం తల్లిందండ్రులను వెంటాడుతూనే ఉంది.