తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్రజలు పట్టించుకోకుండా కాలాయాపన చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొని మీ పార్టీ సమస్యలను ప్రక్కకు పెట్టి ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనులు మానుకోవాలని లేఖలో హితవుపలికిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు చేయాల్సిన టీఆర్ఎస్ సర్కార్.. నెల రోజులుగా పట్టించుకునే పాపాన పోవట్లేదు.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో ప్రజాప్రతినిధులను కొనే పనిలో రైతులను మరిచిపోయారంటూ మండిపడ్డారు.. సీఎం కేసీఆర్… మీకు పార్టీ, ఎన్నికలు, ఎదురు తిరిగిన నేతలను ఇబ్బంది పెట్టడం తప్ప రాష్ట్రంలో ప్రజలు, రైతులు పడుతున్న కష్టాలు పట్టడం లేదా? అంటూ లేఖలో నిలదీశారు.
రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్న వారిని సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కొట్టుకుపోతున్న సరే ప్రభుత్వ పెద్దల మనసు కరగట్లేదు అని మండిపడ్డారు కోమటిరెడ్డి… తేమ ఉందని, తాలు శాతం ఎక్కువగా ఉందని రైస్ మిల్లర్లు కావాలని ధాన్యం కొనట్లేదు. అలాగే కిందిస్థాయి సిబ్బంది, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధులు కలిసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ 70 శాతం మంది రైతులు ధాన్యం తీసుకువచ్చి రోడ్ల మీదనే పడిగాపులు గాస్తున్నారని తెలిపారు.. ఇప్పటికే, రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడంతో కరోనా చికిత్స, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుంది. అలాగే ధాన్యం కొనుగోలుకు కృషి చేయాల్సిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్న లేనట్టే వ్యవహరిస్తున్నారు.. రైతుల ధాన్యం దగ్గరుండి కొనాల్సింది పోయి హుజురాబాద్‌లో ఈటల మనుషులను కొనే పనిలో పడ్డారు అని ఆరోపించారు. ఇక, సర్కార్ వేసిన కరోనా టాస్క్‌ఫోర్స్ టీం సమావేశాలు పెట్టుకోవడానికే తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులపై దృష్టి సారించట్లేదు. రాష్ట్రంలో కరోనా చికిత్సకు బెడ్లు దొరకక.. మందులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న సర్కార్ తమకు వచ్చే కమీషన్ల కోసం మిన్నకుండి పోయిందని ఆరోపించారు కోమటిరెడ్డి.