రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కనీస మద్దతుధర కల్పించడంలో కేంద్రం బాటలోనే రాష్ట్రం పోతోందని విమర్శించిన ఆయన.. కనీస మద్దతు ధర విషయంలో స్పస్టత ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జీవన్‌రెడ్డి.. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 5 శాతం.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోపిడీ చేస్తున్నారని.. క్వింటాలకు 5 కిలోలు తీసినా 6వందల కోట్లు నిలువు దోపిడీ జరుగుతోందన్నారు.. దీనిపై నేను ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు జీవన్‌రెడ్డి.
ఇక, ఒక్క జగిత్యాల జిల్లాలో 50 వేల క్వింటాళ్లు దోపిడీలో 100 కోట్లు మిల్లర్లు దండుకున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు తొడుదొంగలు.. వీళ్ళ మధ్య రైతులు ఆగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులకు మద్దతు ధర ప్రకటించి- కేంద్రంపై యుద్ధం చేస్తే మేం మీ వెంటే ఉన్నామని కేసీఆర్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు వస్తాయి.. ఇందులో 10శాతం 3వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేయలేవా? అని ప్రశ్నించారు. మిల్లర్ల దోపిడీలో టీఆర్‌ఎస్ వాటా లేదు అనుకుంటే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో సాగుపై ఆంక్షలు లేవు.. సాగుపై ఆంక్షలు విధిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.