Site icon NTV Telugu

Jagga Reddy: బీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి సెటైర్లు.. ఆ పార్టీల్లాగే తుస్సుమంటుంది

Jagga Reddy On Brs

Jagga Reddy On Brs

Congress MLA Jagga Reddy Satires On BRS Party: టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఎన్నికల కమిషన్‌కు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా.. అనుమతి లభిస్తుందని బీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్ వేశారు. జాతీయ రాజకీయాల్లో రావాలని టీఆర్ఎస్ వాళ్లు అనుకుంటున్నారని.. అయితే జాతీయ స్థాయిలో రాణించాలనుకున్నా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పటివరకూ రాణించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ లాంటి వారు జాతీయ పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారని.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు కూడా అదే గతి పడుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయని.. అవి కాంగ్రెస్, బీజేపీ అని తేల్చి చెప్పారు.

ఇక ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడానికి కారణం ఎంఐఎం, ఇతర పార్టీలేనని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ హైదరాబాద్ కూడా దాటని ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తోందని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. గుజరాత్‌లో బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే అక్కడ గెలుస్తోందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని.. అయితే టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు రాకుండా బీజేపీకి పోయేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన బలం, మీడియాతో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీకి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ వచ్చినా పర్లేదు కానీ.. కాంగ్రెస్ మాత్రం రావొద్దని అన్నట్లుందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై.. డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

అంతకుముందు.. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఎదుర్కొనే వ్యూహాలపై తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం దర్యాప్తు సంస్థలతో దాడులు చేసుకోవడం వల్ల.. తెలంగాణలో ఆ రెండు పార్టీలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయన్నారు. జాతీయ స్థాయి నుంచి బీజేపీ ఇస్తున్న సూచనల మేరకు రాష్ట్రంలో పరిస్థితులు నడుచుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి కౌంటర్ స్ట్రేటజీ అవసరమని అన్నారు. కాంగ్రెస్‌లో అనైక్యత అనేది అందరికీ కనిపిస్తోందని, మిగతా పార్టీల్లోనూ విబేధాలుంటాయి కానీ బయటకు రావని చెప్పారు. పార్టీని ఎలా మెరుగుపర్చాలన్న అంశం మీదే తాను దృష్టి పెట్టానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version