పెట్రోల్, డీజిల్ ధరలపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీ ఈ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.. మోడీ పెట్రో ధరలను సెంచరీ దాటించారని మండిపడ్డ ఆయన.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో ఏనాడు సామాన్యునిపై భారాన్ని మోపలేదు, ధరలు నియంత్రణలో ఉన్నాయన్నారు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. బీజేపీ ప్రభుత్వం ఓవైపు మత రాజకీయాలకు పాల్పడుతూ.. మరోవైపు ధరలు పెంచుతోందని విమర్శించారు.. పెట్రో ధరలు ఇబ్బడి ముబ్బడిగి పెంచేస్తున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉంది… అందుకే కేసీఆర్ పెరిగిన ధరలపై మౌనం వహిస్తున్నారు అని ఆరోపించారు జగ్గారెడ్డి.