NTV Telugu Site icon

కేసీఆర్ కామెంట్స్… జానారెడ్డి కౌంట‌ర్ ఎటాక్..

Jana Reddy

నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌లు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్దానికి తెర‌లేపాయి.. బుధ‌వారం రోజు బ‌హిరంగ‌స‌భ‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అభ్య‌ర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయ‌గా.. సీఎం వ్యాఖ్య‌ల‌కు అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయ‌న‌.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దు అన్నారు జానారెడ్డి.

తెలంగాణ సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల‌ని హిత‌వుప‌లికారు జానారెడ్డి.. నా సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఏనాడూ ప‌ద‌వుల కోసం పాకులాడ‌లేద‌న్న ఆయ‌న‌.. తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రులతో రాజీనామా చేయించింది జానారెడ్డి కాదా.. జేఏసీ ఏర్పాటు అయ్యింది నా ఇంట్లో కాదా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి.. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా నేను పనిచేశాను.. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నారు.. హైదరాబాద్‎లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు.. ప‌ద‌వుల కోస‌మే కాదు.. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నేను ఏనాడూ ఎవ‌రి చుట్టూ తిరిగింది లేద‌న్నారు జానారెడ్డి.