Site icon NTV Telugu

Congress : వరంగల్ వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. నేతల వ్యాఖ్యలతో జోష్

Congress

Congress

Congress : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహం నింపేలా నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటినుంచి మహేష్ కుమార్ గౌడ్ ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించేవారు. బీసీ బిడ్డగా ఆయనను పీసీసీ అధ్యక్షునిగా నియమించడం కాంగ్రెస్‌కు గర్వకారణం” అని అన్నారు. ఆమె అభిప్రాయపడ్డారు: మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో భాగమవ్వడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కలిగిందని తెలిపారు.

Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఇక సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!

మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తూ అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. “బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడింది. అదే తరహా వ్యూహంతో దేశంలో అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం ప్రజా పాలన కొనసాగుతోంది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉంది” అని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “ఈ పాదయాత్ర ప్రజల కోసం, జనహితం కోసం చేస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి గొప్పనాయకుడనిపించుకునే వారిని ఓడిస్తామని చెప్పాం. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. పాదయాత్రలో ఆ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రతో ఎనలేని బంధం ఉంది” అన్నారు.

అలాగే ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. “పదేళ్లు కేసీఆర్ ప్రజలను మోసం చేశాడు. దోచుకున్న సొమ్మును బయట పెట్టమంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు అన్న, చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలే మిగిలాయి. బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీల మీద మాకు అనుమానం ఉంది. వారు దొంగ ఓట్లతో గెలిచారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి వత్తాసు పలుకుతుంది. బీజేపీ ఎంపీలు దొంగల్లా బుజాలు తడుముకుంటున్నారు” అని విమర్శించారు. అంతేకాకుండా, “నిజామాబాద్ ఎంపీ స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణ ఓటర్లు ఇద్దరూ ఉన్నారు. రెండు చోట్ల ఒకేసారి ఓటు వేయడం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు పైగా గెలుస్తుందని, వర్ధన్నపేటలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

KTR : రేవంత్ చేసే ప్రతీ తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు

Exit mobile version