తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రస్థాయిలో పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీయనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 20 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు.
Read Also: ఇంటర్ విద్యార్థి సంచలన ట్వీట్.. నా సూసైడ్‌కు కారణం ఆ ఇద్దరు మంత్రులే
గురువారం రాత్రి అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 8.9 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. ముంచంగిపుట్టులో 8.8, డుంబ్రిగూడ 9, అరకులోయలో 9.4, జి.మాడుగులలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
