CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!

  • స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
  • విదేశీ ఉద్యోగాలకు భాషా శిక్షణ, TOMCOM కీలక బాధ్యతలు
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, EV-డ్రోన్ కోర్సులు
  • నర్సింగ్ కాలేజీల విస్తరణపై సీఎం కీలక ఆదేశాలు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కార్మిక, ఉపాధి కల్పన (శక్తి) శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సీఎం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అధునాతన రీతిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా యూనివర్సిటీలో ప్రత్యేక ‘రీసెర్చ్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, తెలంగాణ యువతకు విదేశాల్లో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీలోనే విదేశీ భాషలు నేర్పించేందుకు ప్రత్యేక వింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఏటీసీల్లో ఈవీ డిమాండ్ కోర్సులు

ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యంతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంచేందుకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సర్వీసింగ్ కోర్సులతో పాటు ‘డ్రోన్ టెక్నాలజీ’ సంబంధిత కోర్సులను తక్షణమే ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగ యువతకు పాస్‌పోర్ట్ ఇప్పించే ప్రక్రియ నుంచి మొదలుకొని, విదేశీ కంపెనీల్లో సరైన ఉద్యోగాలు సాధించే వరకు అన్ని బాధ్యతలను టామ్‌కామ్‌యే దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. దీనితో పాటు, అంతర్జాతీయంగా రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు తగిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కోరారు.