CM Revanth Reddy : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 88 లక్షలు అవుతుంది. ఈ చర్య భారతీయ ఐటీ ఉద్యోగులను, ముఖ్యంగా టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.
CMRF CHEATING : తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం
ఈ నిర్ణయంతో అనేక యూఎస్ కంపెనీలు స్థానిక అమెరికన్లను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయని ట్రంప్ పరిపాలన పేర్కొంది. తక్కువ ఖర్చుతో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లిపోతారని యూఎస్ వాణిజ్య కార్యదర్శి వ్యాఖ్యానించారు. అలాగే, H-1B వీసా వ్యవస్థను ఐటీ అవుట్ సోర్సింగ్ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇది అమెరికా జాతీయ భద్రతకు కూడా ముప్పు అని ట్రంప్ ఆరోపించారు.
ఈ పరిణామంపై తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ “అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఆ ఆర్డర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. భారత-అమెరికా సంబంధాల్లో ఇది సరైనది కాదు. మన సాంకేతిక నిపుణులు, నైపుణ్య ఉద్యోగుల హితాలను కాపాడుతూ, ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలుగు టెక్కీలకు ఇది పెద్ద కష్టంగా ఉంటుంది. గౌరవనీయ ప్రధాన మంత్రి గారికి మరియు విదేశాంగ మంత్రి శ్రీ @DrSJaishankar గారికి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాను.” అని రాసుకొచ్చారు.
