Site icon NTV Telugu

CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : వరంగల్‌ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు అయినా కబ్జా చేస్తే వదిలిపెట్టం. ఒక్కరిని కాపాడేందుకు వందలమందిని నష్టపెట్టే పరిస్థితి రావొద్దు,” అని కఠినంగా హెచ్చరించారు. ఫ్లడ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్‌ శాఖ సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

చెరువుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు స్పష్టంగా రికార్డ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడి నుంచి నీరు వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనే లెక్కలు పక్కాగా ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం సహించం,” అని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే వరద ముంపు తీవ్రతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

వరదల కారణంగా ఇళ్లను కోల్పోయిన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హుల జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. “వాతావరణ మార్పుల కారణంగా క్లౌడ్‌ బస్ట్‌లు తరచుగా వస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండేలా ప్రణాళికలు రూపొందించండి,” అని సీఎం పేర్కొన్నారు.

ఇసుక మేటలు ఏర్పడిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్‌ కింద పనులు ప్రారంభించాలని సూచించారు. “ఈ పనులు రైతులకు ఉపాధి కూడా ఇస్తాయి, భూమికి ఉపయోగకరంగా ఉంటాయి,” అని తెలిపారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడా పనులు ఆగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే అదనపు నిధులు ఇస్తాం,” అని హామీ ఇచ్చారు. స్మార్ట్‌ సిటీకి సంబంధించిన ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల మధ్య సమన్వయం కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. “అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్‌లో ఉండాలి. కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్‌ విజిట్‌ చేసి పరిస్థితులు సమీక్షించాలి,” అని కఠినంగా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముంపు నష్టాలు ఎక్కువయ్యాయని సీఎం స్పష్టం చేశారు. “ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. అధికారులు సమయానికి స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవు, మేం సీరియస్ గా తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకుంటుండొచ్చు.. అలా కాకుండా ఎలా చేయాలో తెలుసు..” అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

Traffic Rules : హైదరాబాద్‌లో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ ఇక కుదరదు నాయనా..!

Exit mobile version