CM Revanth Reddy : నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల సన్మాన వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సీఎం, తనను , తన కుటుంబాన్ని గతంలో కేసీఆర్ వేధించారని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసుకున్నారు. “నన్ను జైల్లో పెట్టి అణచివేయాలని చూశారు, కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుము విరిగి పడిపోయారు. ఆయన చేసిన పాపాలే ఆయనను వెంటాడుతున్నాయి. జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు తిండి పెట్టడం ఎందుకని నేను ఒక్క కేసు కూడా పెట్టకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు సోయి లేకుండా మాట్లాడుతూ తోలు తీస్తా అని స్థాయి లేని మాటలు మాట్లాడుతున్నారు” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిసవాల్ విసురుతూ, “రా.. నీ చింతమడకకు రమ్మంటావా లేక కొడంగల్ వస్తావా? ఎక్కడైనా తేల్చుకుందాం. మటన్ కొట్టు మస్తాన్ దగ్గర పొట్టేలును కోసిన తర్వాత తోలు తీసే పని కేసీఆర్‌కు ఇమ్మని చెప్పాను. సాయంత్రం వెళ్లేటప్పుడు దావత్ కోసం ముక్కో బొక్కో ఇచ్చి పంపమని సూచించాను. నన్ను గెలికితే నేను మాట్లాడటం మొదలుపెడితే నువ్వు ఉరి వేసుకుని చస్తావు. నేను నీలాగా పాస్‌పోర్ట్ బ్రోకర్ దందాలు చేయలేదు, ఎవరిని దుబాయ్ పంపుతా అని మోసం చేయలేదు” అంటూ పాత విషయాలను ప్రస్తావించారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతానికి పైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికార పీఠం దరిదాపుల్లోకి కూడా రానివ్వనని భీష్మించుకున్నారు.
కుటుంబ వ్యవహారాల పైన కూడా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో సొంత బిడ్డను, అల్లుడిని వెళ్లగొట్టాడని, సొంత చెల్లెలిని పండుగకు కూడా ఇంటికి పిలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. “పిడకల మూతి బోడిలింగం లాంటి కేటీఆర్, నువ్వు, నీ జాతి అంతా వచ్చినా నేను భయపడను. మీ రాజకీయం ఏంటో చూపిస్తా, రాసి పెట్టుకో” అని సవాల్ విసిరారు. చివరగా సర్పంచ్‌లకు భరోసా ఇస్తూ, గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం మార్చి 31లోపు మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Delhi vs Andhra: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ.. ఆంధ్రపై ఢిల్లీ భారీ విజయం..!
