హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాజీ సీఎం సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఇటీవల బాత్‌రూం కాలు జారి పడిపోయిన కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
Also Read: TS Ministers: కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ
కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకే అన్ని స్థానాలు లభించాయి. దీంతో తొలుత ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కావడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఎంఐఎం నేతలతో వాదనలకు దిగిన రేవంత్‌రెడ్డి అదే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర నర్సింహాతో పాటు ఇతర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ బహిరంగ లేఖ