CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు

  • వనస్థలిపురంలో దేవుడి భూముల్ని కూడా కబ్జా పెట్టారు
  • ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం
  • భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రా తెచ్చాం
  • హైడ్రాను ఒక భూతంలా చూపిస్తున్నారు. -సీఎం రేవంత్‌
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్‌ లోని గుర్రంగూడ ఎకో పార్క్‌లో మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణ, కబ్జాల నిరోధమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే హైడ్రాను ఒక భూతంలా చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైడ్రా ఎప్పుడూ కూడా పేద ప్రజల జోలికి వెళ్లదని, కేవలం ప్రభుత్వ ఆస్తులను మింగేసే పెద్ద పెద్ద కబ్జాదారుల భరతం పట్టడానికే దీనిని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. గతంలో ఒక రాజకీయ కుట్ర కారణంగానే తాను కొడంగల్‌లో ఓడిపోయానని, కానీ మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను నిలబెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. చివరకు గుర్రంగూడ ఎకో పార్కును కూడా కబ్జా చేయాలని చూశారని, కానీ తాము పెద్ద పెద్ద లాయర్లను పెట్టి పోరాడి మరి 424 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు.

×
×
Ad

దేవుడి భూములను కూడా వదలట్లేదు.!

వనస్థలిపురంలో దేవుడికి చెందిన భూములను సైతం వదలకుండా కబ్జాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే వీపులు సున్నం చేస్తాం” అని ఆయన గట్టిగా హెచ్చరించారు. భూకబ్జాల వల్ల భవిష్యత్తులో సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దించిందని తెలిపారు. నగరానికి గుండెకాయ లాంటి మూసీ నదిని పునరుజ్జీవనం (ప్రక్షాళన) చేద్దామని తాము చూస్తుంటే, కొందరు రాజకీయ స్వార్థం కోసం దానికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌కు కాలుష్య ముప్పు రాకూడదనే..

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాలు విపరీతమైన కాలుష్య కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాయని సీఎం గుర్తుచేశారు. రేపటి రోజున మన హైదరాబాద్ నగరానికి కూడా అలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదనే ముందుచూపుతోనే తాము పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని , పచ్చదనాన్ని ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. నగరాన్ని కాలుష్య రహితంగా, సురక్షితంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.