CM Revanth Reddy : కాంగ్రెస్ పీఏసీలో రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి రెండు డిమాండ్లు

  • 2027 జనగణనలో ఓబీసీ కులగణనకు డిమాండ్
  • ఎల్‌నినో ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్ల సాయం
  • ఓట్ల తొలగింపుపై రేవంత్ తీవ్ర ఆరోపణలు
  • ఐదు నెలల ప్రజా బలం కార్యక్రమానికి పిలుపు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నూతన ఇంచార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్‌కు స్వాగతం పలికిన ఆయన, ఆ బాధ్యత అప్పగించిన సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మీనాక్షి నటరాజన్ ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు ఉపఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాలు సాధించిందని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మునిసిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయం సాధించామని, మీనాక్షి నటరాజన్ సేవలకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.

ఓబీసీ కులగణన.. 2027 జనగణనపై తీర్మానం

వందేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కూడా ఓబీసీ కులగణన చేర్చాలని ఈ సమావేశం ద్వారా తీర్మానం చేసి కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు. తొలి ప్రధాని నెహ్రూ చొరవ వల్లే దేశంలో అందరికీ విద్య అందుతోందని, ఆయన ప్రణాళికలతోనే ఇరిగేషన్ రంగం బలపడి, మిగులు ఆహార ధాన్యాలు వచ్చాయని గుర్తు చేశారు.

ఎల్‌నినో ప్రభావం.. రూ. 30 వేల కోట్ల సాయం కోరుతూ తీర్మానం

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా పడటం లేదని, రైతులు తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదని, వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా రైతులకు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలు ఎల్‌నినోతో ఇబ్బంది పడుతున్నాయని, పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎనిమిది నెలల పాటు తాగునీరు అందించాల్సి ఉన్నందున ప్రాజెక్టులలోని నీటిని తాగునీటికి వాడాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రూ. 30 వేల కోట్ల సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ పీఏసీ సమావేశంలో తీర్మానాలు చేయాలని, అందరికీ ఉపాధి కల్పించేలా త్వరలో పెద్ద కార్యక్రమం చేపడతామని, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి సంఖ్య పెరిగిందని వివరించారు.

ఓట్ల తొలగింపుపై ఆందోళన.. ప్రజా బలం కార్యక్రమం

ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలని నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆనాడు భావించారని, కాంగ్రెస్ ఆ హక్కును ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2019లో 130 కోట్ల జనాభాకు 91 కోట్ల ఓట్లు ఉండగా, 2024లో 140 కోట్ల జనాభాకు 97.5 కోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పారు. సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపించారు. వలసల పేరుతో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారని, తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని అన్నారు. ఇంటి పేరు సరిగా లేకపోయినా యాంత్రికంగా ఓట్లు తీసేస్తున్నారని విమర్శిస్తూ, కాంగ్రెస్ బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిటిష్ కాలంలో సైమన్ కమిషన్‌లా వందేళ్ల తర్వాత మోదీ సర్ తీసుకొచ్చారని, సైమన్ కమిషన్ గో బ్యాక్ నినాదం తరహాలో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వరకు వేచి చూడొద్దని, బీజేపీ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులను తయారు చేస్తోందని ఆరోపించారు. సంక్రాంతి తరహాలో ఐదు నెలల పాటు ప్రజా బలం కార్యక్రమం చేపట్టి నేతలు ప్రతి గ్రామానికి వెళ్లాలని, నిధులకు కొరత లేకుండా పనిచేస్తామని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని చెప్పారు.

ఎమ్మెల్యేల వ్యాఖ్యలు.. ప్రాజెక్టులపై సీఎం, పొన్నం కౌంటర్

సమావేశంలో ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై కూడా సీఎం రేవంత్ మాట్లాడారు. మంచి ఉంటే మైక్‌లో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలని హితవు పలికారు. అధిష్టానం ఆదేశాలను వంద శాతం పాటిస్తామని, కార్యకర్తల కోసం మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇక సమావేశం అనంతరం గాంధీ భవన్‌లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, 2022లో కేసీఆర్, వైఎస్ జగన్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైందని, 2022లో రూ. 1,580 కోట్లకు జల్ జీవన్ మిషన్ జీవో వచ్చిందని చెప్పారు. పోతిరెడ్డిపాడు అంశం టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే మొదలైందని, తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారని, 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేశారని, భూసేకరణకు కూడా కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని విమర్శించారు.